హైదరాబాద్: జీవించి ఉండగా ఇతరుల కడుపు నింపేందుకు కష్టించాడు. దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో తనువు చాలించి తన ఐదు అవయవాలతో మరో అయిదుగురికి ప్రాణభిక్ష పెట్టాడు ఓ రైతు. గండి మైసమ్మ మండలం సారయ్యగూడేనికి చెందిన రైతు సత్యనారాయణ (55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 11వతేదీన బైక్‌పె దూలపల్లి గ్రామానికి వెళుతుండగా చిరునామా తెలియని వాహనం ఢీ కొట్టింది. స్థానికులు అతన్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం అతన్ని సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన రక్తస్రావం, తలకు బలమైన గాయాలై ఉండడంతో అతన్ని పరిశీలించిన వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు.
విషయం తెలుసుకున్న జీవన్‌దాన్ సిబ్బంది సత్యనారాయణ భార్య కమలమ్మకు అవయవదానం గురించి అవగాహన కల్పించారు. అతని నుంచి రెండు కిడ్నీలు, ఒక లివర్, రెండు కంటి కార్నియాలను సేకరించి భద్రపరిచారు. వీటిని అవసరమున్న వారికి అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని వారు పేర్కొన్నారు.
Oct 15,2019 06:07AM