ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ తమిళనాడులోని మామల్లాపురంలో శుక్రవారం కలుసుకున్నారు. అయితే మోడీ పర్యటనపై తమిళులు భిన్న అభిప్రాయలను వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో వివిధ రకాల హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అయ్యాయి. అయితే ఇందులో 'గో బ్యాక్ మోడీ' అనే హ్యాష్‌ట్యాగ్ ఇండియన్ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. తమిళులు మోడీని వ్యతిరేకించారని కొందరు వాదిస్తుండగా దీని వెనుక కుట్ర దాగి ఉందని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలోనూ మోడీకి ఇదే అనుభవం ఎదురైంది. 'మోడీ పరత్ జా' (గో బ్యాక్ మోడీ) అనే మరాఠీ హ్యాష్‌ట్యాగ్ మరోసారి ఇండియా ట్రెండ్స్‌లో మొదటి స్థానానికి వచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆదివారం బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్నారు. మోడీని మహారాష్ట్ర నుంచి వెళ్లిపోవాలంటూ ట్విట్టర్‌లో కొందరు ఇలా డిమాండ్ చేస్తున్నారు. 'ఈరోజు మ్యాచ్ మరాఠీలకు బీజేపీ ఐటీసెల్‌కు. మోడీ పరత్ జా అనే హ్యాష్‌ట్యాగ్‌తో మరాఠీలు విజయం సాధించారు' అని ఓ వ్యక్తి ట్వీట్ చేస్తూ.. మోడీని వ్యతిరేకించే, మద్దతు తెలిపే ట్వీట్ల సంఖ్యను రాసుకొచ్చాడు. 'మహారాష్ట్రలో వరదలు విధ్వంసాన్ని సృష్టించాయి. వరద సహాయానికి కేటాయించిని 68,000 కోట్లలో మాకు (మహారాష్ట్రకు) 5శాతం నిధులను కూడా విదిల్చలేదు. ఆర్‌బీఐ నుంచి కేంద్రం 1,70,000 కోట్లు తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం కోసం 30 ర్యాలీలకు వందల కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు అడుక్కుంటున్నారు' అని మరో నెటిజెన్ ట్వీట్ చేశాడు.
Oct 13,2019 07:25PM