Sep 25,2018 11:09AM-7
శాన్ ఫ్రాన్సిస్‌కో: ప్రముఖ ఫొటో షేరింగ్ సర్వీస్ ఇన్‌స్టాగ్రాం నుంచి దాని సహ వ్యవస్థాపకులైన కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రీగర్ తప్పుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రాంను ఆరేళ్ల క్రితం ఫేస్‌బుక్ బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రాం సహ వ్యవస్థాపకులు సిస్ట్రోమ్, క్రీగర్ రాజీనామా చేస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. సంస్థలో సిస్ట్రోమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవిలో ఉండగా క్రీగర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పదవిలో కొనసాగుతున్నారు. కాగా వారు తమ పదవుల నుంచి తప్పుకుంటున్నారని, అయితే ఎందుకు రాజీనామా చేస్తున్నారో కారణం తెలియజేయలేదని, కాస్త విరామం కోసమే తప్పుకుంటున్నట్లు మాత్రమే చెప్పారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. దీనిపై ఫేస్‌బుక్‌ను స్పందన కోరగా స్పందించలేదని వెల్లడించింది.