హైదరాబాద్: అసోం అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి సమ్ రోంగ్‌హంగ్ బీజేపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ జితేంద్ర సింగ్, పార్టీ స్టేట్ యూనిట్ చీఫ్ రిపున్ బోరా సమక్షంలో సమ్ రోంగ్‌హంగ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రోంగ్‌హంగ్‌కు కాంగ్రెస్ నేతలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సమ్ రోంగ్‌హంగ్ మాట్లాడుతూ.. తనకు టికెట్ కేటాయించకపోవడం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. తాను అంకితభావంతో పని చేసినప్పటికీ బీజేపీ తనకు టికెట్ ఎందుకు నిరాకరించిందో అర్థం కావడం లేదన్నారు. కావాలనే కొందరు కుట్ర చేసి తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున డిఫు నియోజకవర్గం నుంచి రోంగ్‌హంగ్ పోటీ చేసే అవకాశం ఉన్నది. మొత్తం 126 శాసనసభ స్థానాలు ఉన్న అసోంలో మూడు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో భాగంగా 12 జిల్లాల్లోని 47 స్థానాలకు మార్చి 27న పోలింగ్ జరగనుంది. రెండో దశలో భాగంగా 13 జిల్లాల్లోని 39 నియోజకవర్గాలకు ఏప్రిల్ 1న, తుది దశలో భాగంగా 12 జిల్లాల్లోని 41 స్థానాల్లో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది.
Mon Jan 19, 2015 06:51 pm