హైదరాబాద్ : పాఠశాలలోనే ఉపాధ్యాయుడిని నిర్బంధించిన ఘటన... ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం ఘోట్కోరిలో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం ఉన్నత పాఠశాలలోని విద్యార్థినులకు మొబైల్లో నీలి చిత్రాలు చూపించినట్లుగా గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం బాలికలు తల్లిదండ్రులకు చెప్పడంతో... అతడిని పాఠశాల గదిలో ఉంచి తాళం వేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అక్కడికి చేరుకున్న సర్పంచ్ గ్రామస్థులకు నచ్చజెప్పి తాళం తీయించి... ఉపాధ్యాయుడిని నిలదీశారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. డీఈవో రవీందర్ రెడ్డికి విషయం తెలిసి... విచారణ కోసం సెక్టోరల్ అధికారులను పాఠశాలకు పంపించారు. ఆరోపణలు రుజువైతే... చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల మద్యం తాగి, జూదం ఆడుతూ దొరికిన ఎంఈవో, మరో ఐదుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన ఘటన మరువక ముందే ఈ ఘటన జరగడం జిల్లా విద్యాశాఖలో చర్చకు దారి తీసింది.
Mon Jan 19, 2015 06:51 pm