హైదరాబాద్ : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు ప్రచారం ర్యాలీల్లో భాగంగా కన్యాకుమారిలో రోడ్‌షోలో పాల్గొని కేంద్ర, తమిళనాడు ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు సంస్కృతిని గౌరవించదు. ఇక్కడ వారి ప్రతినిధిలా ముఖ్యమంత్రి పళనిస్వామి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే దాన్ని ఆయన చేస్తారు. ఆయన రాష్ట్రానికి ప్రాతనిధ్యం వహించరు.. మోడీకి ప్రతినిధిగా ఉంటూ ఆయన ఏం చెబితే అది చేస్తారు. మోడీ ముందు తలవంచే వారు తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించలేరు అని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. తమిళ సంస్కృతిని ఆర్ఎస్ఎస్ అవమానించే అవకాశాన్ని ముఖ్యమంత్రి ఇవ్వకూడదు. ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర అని మోడీ అంటారు. మరి తమిళం భారతీయ భాష కాదా? తమిళ చరిత్ర భారత చరిత్ర కాదా? ఒక భారతీయుడిగా తమిళ సంస్కృతిని కాపాడడం నా విధి అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. కాగా, ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రెండు నెలల్లో తమిళనాడులో ప్రభుత్వం మారనుంది. ప్రజలు కూడా చాలా ఆత్రుతగా దీని కోసమే ఎదురు చూస్తున్నారు అని స్టాలిన్ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm