హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాద దంపతుల హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. హత్యకు నిందితులు ఉపయోగించిన కొడవళ్ల స్వాధీనానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వామన్‌రావు, నాగమణిని చంపేందుకు ఉపయోగించిన ఆయుధాలను సుందిళ్ల బ్యారేజీలో పడేసినట్లు నిందితులు తెలిపిన నేపథ్యంలో వాటిని వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. దీనికోసం విశాఖ నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. భారీ భద్రత నడుమ నిందితుడు బిట్టు శ్రీను, మరొకరిని సుందిళ్ల బ్యారేజీ వద్దకు తీసుకెళ్లి ఆయుధాలు పడేసిన చోటుపై ఆరా తీశారు. 59-60 పిల్లర్ల మధ్య కొడవళ్లను పడేసినట్లు నిందితులు అంగీకరించారని పోలీసుల తెలిపారు. విశాఖ నుంచి వచ్చిన ఆరుగురు గజ ఈతగాళ్లు కొడవళ్ల కోసం వెతికారు. పార్వతీ బ్యారేజీ వద్ద సుమారు 4 గంటల పాటు ముమ్మరంగా గాలించారు. చీకటి పడటంతో కొడవళ్ల గాలింపును రేపటికి వాయిదా వేశారు. ఈ గాలింపు చర్యలను పెద్దపల్లి డీసీపీ రవీందర్, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm