హైదరాబాద్: నైజీరియాలోని ఓ స్కూల్లో చదువుకుంటున్న 317 మంది విద్యార్థినిలను దుండగులు అపహరించారు. ఈ ఘటన జమ్ఫారా రాష్ట్రంలోని జంగేబి గ్రామంలో జరిగింది. ఆఫ్రికా ఖండంలోని అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో అపహరణలు సర్వసాధారణం అయ్యాయి. విద్యార్థులను ఎత్తుకెళ్లి డబ్బులు డిమాండ్ చేయడం అక్కడ పరిపాటిగా మారింది. ప్రభుత్వ బాలికల సెకండరీ పాఠశాలలోకి దూసుకువచ్చిన మిలిటెంట్లు.. అక్కడ కాల్పులు జరిపి పిల్లలను తమ వాహనాల్లో తరలించారు. సమీపంలో ఉన్న రుగు అడవుల్లోకి వారిని తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. రుగు అడువులు సుమారు మూడు రాష్ట్రాల్లోని, వందలాది మైళ్లలో విస్తరించి ఉన్నది. బాలికలను ఎత్తుకెళ్లిన వారిని పట్టుకునేందుకు జమ్ఫారా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉత్తర నైజీరియా ప్రాంతంలో ఇటీవల కాలంలో కిడ్నాప్ కేసులు ఎక్కువయ్యాయి. గత వారమే సాయుధ మిలిటెంట్లు.. 42 మందిని అపహరించారు. గత ఏడాది కనకారా రాష్ట్రంలో 300 మంది బాలలను ఎత్తుకెళ్లారు. అయితే ఆ తర్వాత వారిని విడిచిపెట్టారు. తాజాగా అమ్మాయిలు కిడ్నాప్ అయిన ఘటనను అధ్యక్షుడు మొహమ్మదు బుహారి ఖండించారు. ఇది అమానవీయం.. అనైతికం అంటూ ఆయన పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm