హైదరాబాద్ : కరోనా నిబంధనలను మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా.. కోవిడ్ నిబంధనల అమలును పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా వ్యాక్సినేషన్ ను కొనసాగించాలని... అప్పుడే కరోనా చైన్ ను బ్రేక్ చేయగలమని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లను సరిగా గుర్తించాలని కేంద్రం తెలిపింది. ఈ జోన్లలో కరోనా నిబంధనలను పటిష్ఠంగా అమలు చేయాలని చెప్పింది. జనవరి 27న విడుదల చేసిన గైడ్ లైన్స్ ను పాటించాలని తెలిపింది. అయితే కొత్త నిబంధనల ప్రకారం సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ కొనసాగుతాయి. సామాజిక, మత, సాంఘిక కార్యక్రమాలపై ఆంక్షలు ఉండవు. పాఠశాలలు, థియేటర్లు వంటివి 50 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగవచ్చు. క్లోజ్డ్ ప్రదేశాల్లో 200 మందికి మించి గుమికూడరాదు. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, సరకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ట్రేడ్ ఒప్పందాల ప్రకారం సరిహద్దు దేశాలతో వాణిజ్యం కొనసాగుతుంది. ప్రయాణాలకు ఎలాంటి ఈ-పర్మిషన్లు అవసరం లేదు. కంటైన్మెంట్ జోన్లకు వెలుపల అన్ని కార్యకలాపాలను కొనసాగించవచ్చు. అయితే కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాల్సి ఉంటుంది.
Mon Jan 19, 2015 06:51 pm