హైదరాబాద్ : పరిహారం కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఓ వ్యక్తి సెల్టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. వివరాల ప్రకారం.. బుర్రా రాములు అనే యువకుడు... తన తండ్రి బుర్రా శంకరయ్య 2019లో తాటి చెట్టు మీదనుంచి పడి మృతి చెందాడని తెలిపాడు. ఆ విషయమై తన తండ్రి మరణ ధృవీకరణ పత్రాలతో ఎక్సైజ్ శాఖ అధికారుల చుట్టు తిరిగినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాని.. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తనకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు పైఅధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగాడు.
Mon Jan 19, 2015 06:51 pm