హైదరాబాద్ : తెలంగాణలో హైకోర్టు న్యాయవాది వామనరావు దంపతులు హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుడు బిట్టు శ్రీను పోలీసుల రిమాండ్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. న్యాయవాది వామనరావు హత్యకు నాలుగు నెలల క్రితమే బిట్టు శీను ప్లాన్ చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. వామనరావ్ బతికుంటే తమకు ఎప్పుడైనా సమస్యనే అని బిట్టు శీను, మరో నిందితుడు కుంట శీను భావించినట్లు చెబుతున్నారు. బిట్టు శీను చైర్మన్‌గా ఉన్న పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టుపై వామనరావు అనేక కేసులు వేశారు. నాలుగు నెలల క్రితం గుంజపడుగులోనే పాత స్కూల్ బిల్డింగ్ నుంచి శీను గ్యాంగ్ రెక్కీ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. వామనరావు చుట్టూ జనాలు ఎక్కువ ఉండటంతో ప్లాన్ ఫెయిల్యూర్ అయింది. అయితే ఈనెల 17న వామనరావు ఒంటరిగా దొరకడంతో వామనరావు హత్యకు బిట్టు శీను, కుంట శీను ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వామనరావు హత్య తర్వాత బిట్టు శీనుకు కుంట శీను ఫోన్ చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. వామనరావు దంపతులు చనిపోయారని బిట్టు శీనుకు కుంట శీను సమాచారం అందించాడు. హత్య తర్వాత కుంట శీను అండ్ గ్యాంగ్‌ను మహారాష్ట్రకు వెళ్లిపోమని బిట్టు శ్రీను సలహా ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm