హైదరాబాద్ : పంటను నాశనం చేస్తున్న అడవి పందులను వధించడానికి గ్రామ సర్పంచులకు విచక్షణాధికారాన్ని కట్టబెడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. ఈ క్రమంలో సర్పంచులను గౌరవ వైల్డ్‌లైఫ్ వార్డెన్లుగా నియమించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972లోని సెక్షన్ 4(3) ప్రకారం ఈ నియామకం జరిపింది. ఈ మేరకు అటవీశాఖ ఇన్‌చార్జి ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అటవీయేతర, రక్షిత ప్రాంతాల్లో మాత్రమే అడవిపందులను చంపేందుకు సర్పంచ్‌లకు అనుమతులు లభించాయి. వ్యవసాయ పంటలు, ఉద్యానవనాల పరిధిలోనే కల్లింగ్ ఉండాలి కానీ ఏ ఇతర ప్రాంతంలోనూ అడవి పందులకు హాని తలపెట్టరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, దీనివల్ల కొందరు అడవి పందులను విచక్షణారహితంగా వధిస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయంపై వన్యప్రాణి సంరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm