హైదరాబాద్ : తాగిన మైకంలో బండి నడుపుతూ యువకుడు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మరో మహిళ ఉసురు తీశాడు. ఈ విషాద ఘటన హైదరాబాబాద్ శివారులో చోటుచేసుకుంది. ఒళ్లుగగుర్పొడిచేలా జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శంషాబాద్ సమీపంలోని పెద్ద తుప్రా వద్ద ఈ ప్రమాదం జరిగింది. కులక్చర్ల మండలం అంతారం గ్రామానికి చెందిన శ్యామ్ మద్యం మత్తులో వేగంగా బైక్ నడుపుతూ తుప్రా వద్ద సాక్రీ అనే మహిళను ఢీకొట్టాడు. ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన బైక్ అమాంతం ఢీకొట్టింది. బైక్ బలంగా తగలడంతో ఆమె తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. అతివేగంగా ఉండడంతో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి కరెంటు స్తంభాన్ని ఢీకొంది. కరెంటు స్తంభానికి తగిలి బైక్ నడుపుతున్న శ్యామ్ యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. తాగిన మైకంలో బండి నడిపి తాను చనిపోవడమే కాకుండా.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అమాయకురాలి మరణానికి కారణమయ్యాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm