ఢిల్లీ: వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై పోరాటం చేస్తున్న రైతు సంఘాలు తమ తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ఫిబ్రవరి 1న పార్లమెంట్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు క్రాంతికారి కిసాన్ యూనియన్‌కు చెందిన ప్రతినిధి దర్శన్ పాల్ మీడియాకు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ట్రాక్టర్ ర్యాలీ తలపెట్టిన వేళ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడం గమనార్హం. నూతన వ్యవసాయానికి మరణశాసనాలాంటి చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని దర్శన్ అన్నారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ వైపు వివిధ మార్గాల నుంచి కాలినడకన ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. రేపటి ట్రాక్టర్ ర్యాలీతో రైతుల సామర్థ్యం ఏంటో ప్రభుత్వానికి తెలిసొస్తుందని చెప్పారు. రైతుల ఉద్యమం కేవలం పంజాబ్, హర్యాణ రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది కాదని, ఇది దేశవ్యాప్త ఉద్యమం అనే విషయం తెలుస్తుందని దర్శన్ అన్నారు. తాము చేపట్టబోయే ప్రదర్శనలు, ఆందోళనలు శాంతియుతంగా జరుగతాయని స్పష్టంచేశారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీని పురస్కరించుకుని ఢిల్లీలో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు లక్షల ట్రాక్టర్లు ఈ పరేడ్‌లో పాల్గొంటాయని రైతు సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm