హైదరాబాద్ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై పలు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా మహారాష్ర్టలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త సాగు చట్టాలను అమలు చేయమని ఆ రాష్ర్ట అసెంబ్లీ స్పీకర్ నానా పటోల్ స్పష్టం చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా మహారాష్ర్ట రాజధాని ముంబైలో అన్నదాతలు నిరసన చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనలో అత్యధికంగా నాసిక్ జిల్లాకు చెందిన రైతులే ఉన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా అసెంబ్లీలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ.. కొత్త సాగు చట్టాలపై రాష్ర్ట ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి సమీక్షిస్తుందని తెలిపారు. అయితే రాష్ర్టంలో ఈ చట్టాలను అమలు చేయమని స్పష్టం చేశారు. తాను కూడా రైతునే కాబట్టి అన్నదాతల నిరసనకు తప్పకుండా మద్దతు తెలియజేస్తానని స్పీకర్ పేర్కొన్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మహారాష్ర్ట కాంగ్రెస్ ప్రెసిడెంట్ బాలసాహెబ్ థోరత్ కూడా రైతుల నిరసనకు మద్దతు ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm