హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో నేడు జిల్లా స్థాయి వ్యవసాయాధికారులు, మార్కెటింగ్ శాఖాధికారులతో సమావేశమయ్యారు. అన్ని జిల్లాలకు చెందిన అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. వ్యవసాయశాఖ కాగితం, కలం శాఖగా కాకుండా పొలం, హలం శాఖగా మారాలని సూచించారు. ఈ రెండుశాఖల పనితీరులో గుణాత్మక, గణనీయ మార్పు రావాలని చెప్పారు. సాగులో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక పద్ధతులు తీసుకువచ్చేందుకు వ్యవసాయశాఖ మరింత కృషి చేయాలన్నారు. రైతులు పండించిన పంటలను మార్కెట్‌లో ఇబ్బంది లేకుండా అమ్ముకునేలా చూడాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉందని పేర్కొన్నారు. కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాల దేశవ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎలా పరిణామం చెందినా.. తెలంగాణలో మాత్రం మరింత బలోపేతం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. పదిరోజుల్లోగా ఏ గుంటలో ఏ పంట వేశారో పూర్తి లెక్కలు తీయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మించిన రైతు వేదికలను వెంటనే వినియోగంలోకి తేవాలని, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ‘రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలి. పంట మార్పిడి విధానం రావాలి. పంట మార్పిడి వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయి. గ్రామాల్లో కూలీల కొరత ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలి. పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధతులు రావాలి. ఈ అంశాల పై రైతులకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా 2600 క్లస్టర్లలో నిర్మించిన రైతువేదికలను వెంటనే వినియోగంలోకి తేవాలి. రైతులతో సమావేశాలు నిర్వహించాలి. పంటల సాగు, పంటల మార్పిడి, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. క్లస్టర్ల వారీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు వెంటనే గ్రామాల్లో పర్యటించాలి. ఏ గుంటలో ఏ పంట వేశారనే వివరాలు నమోదు చేయాలి. పది రోజుల్లోగా రాష్ట్రవ్యాప్తంగా సాగవుతున్నపంటల విషయంలో స్పష్టత రావాలి’ అని సీఎం ఆదేశించారు. ఏఈఓ, రైతుబంధు సమితి కార్యాలయాలు కూడా రైతువేదికలో భాగంగా ఉండాలని, ఇందుకు అవసరమైన ఫర్నీచర్, ఇతర వసతులు కల్పించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయాభివృద్ధి-రైతు సంక్షేమంలో ఈ రెండుశాఖల బాధ్యతలను విడమర్చి చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఎంపి కె.కేశవరావు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మార్క్ ఫెడ్ చైర్మన్ మారం గంగారెడ్డి, సీఎంఓ అధికారులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కమిషనర్ అనిల్ కుమార్, డైరక్టర్ లక్ష్మీబాయి, సీడ్స్ కార్పొరేషన్ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm