హైదరాబాద్: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో మినీ డైరీ పైలట్ ప్రాజెక్టును మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ ఆదివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి విడతలో వంద మంది లబ్ధిదారులకు గేదెలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మినీ డెయిరీ పైలట్ ప్రాజెక్టుని అద్భుతంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఇప్పుడు సబ్సిడీపై ఇచ్చే పాడిగేదెల ద్వారా వచ్చే పాలను ప్రభుత్వ సంస్థ విజయ డెయిరీ తీసుకుంటుందని, ఒక్కో లీటర్ పాలకు అదనంగా రూ.4ని ప్రోత్సాహకంగా ఇస్తుందని చెప్పారు. రైతులకు రావాల్సిన డబ్బులను విజయ డెయిరీ వారి ఖాతాల్లో వేస్తుందని, క్రమేణా వారి రుణం కూడా తీరిపోతుందని, ఆ తర్వాత ఆ పాడితో వచ్చేదంతా లాభమేనన్నారు. అయితే లబ్ధిదారులు ఒక సొసైటీలా ఏర్పడాలని, ఆ సొసైటీని విజయ డెయిరీకి అనుసంధానిస్తారని చెప్పారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు మినీ డెయిరీ ప్రాజెక్టుని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2084 మంది లబ్ధిదారులకు రూ.80 కోట్ల విలువైన పాడిగేదెల పంపిణీ జరుగుతున్నదని, ఇందులో రూ.50 కోట్ల మేర సబ్సిడీ లభిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, అదనపు కలెక్టర్ మహేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, విజయ డెయిరీ సంస్థ, ఎస్సీ కార్పొరేషన్, వివిధ విభాగాల అధికారులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm