అమరావతి: అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది. గంట వ్యవధిలోనే ఇద్దరు ఉరేసుకొని తనువు చాలించడం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. కంబదూర్ మండలం రాళ్లఅనంతపురం గ్రామానికి చెందిన స్వీటీ (21), మచ్చింద్ర (25) భార్యాభర్తలు. కొంతకాలంగా వీరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన స్వీటీ ఇవాళ ఉదయం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటి తరువాత విషయం తెలుసుకున్న భర్త మచ్చింద్ర తీవ్ర ఆవేదనకు గురై బైక్‌పై పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సిన వారు కొద్ది సమయం తేడాతో దంపతులిద్దరూ చనిపోవడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు ఘటనాస్తలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm