హైదరాబాద్ : మే 29న ఏఐసీసీ సమావేశం నిర్వహించి కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నిక చేపట్టాలని సీడబ్ల్యూసీ సమావేశంలో నాయకులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మే 15వ తేదీ నుంచి మే 30వ తేదీ మధ్య ఆ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఫిబ్రవరిలోనే పార్టీ అంతర్గత ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మేలో జరిగే ప్లీనరీ సమావేశాల్లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ సమావేశంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతుల ఆందోళనలతో పాటు కరోనా మహమ్మారిపై ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. సంప్రదింపుల పేరుతో రైతుల విషయంలో ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరించిందని సోనియా గాంధీ ఆరోపించారు. జాతీయ భద్రత విషయంలోనూ పూర్తిగా రాజీ పడుతోందని అన్నారు. అర్నబ్ లీక్స్పై ప్రభుత్వం తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm