హైదరాబాద్ : సకాలంలో అప్పు చెల్లించలేదని రైతుల భూమిని బ్యాంక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాదేయపడినా కనికరించకుండా అప్పు తీర్చాలని పొలాల్లో వర్ధన్నపేట డీసీసీబీ ఎర్రజెండాలు పాతింది. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. రాయపర్తి మండలంలోని కేశవపురం, సూర్య తండకు చెందిన నలబోతుల నరసయ్య, మునవత్ మంజ్యా వ్యవసాయ భూమిని వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వర్ధన్నపేట బ్రాంచిలో తాకట్టు పెట్టారు. నాలుగు లక్షల వరకు సుమారు ఐదేళ్ల క్రితం దీర్ఘకాలిక రుణం తీసుకున్నారు. అసలు వడ్డీ చెల్లించాల్సి ఉండగా.. గత కొన్ని రోజులుగా బ్యాంకు నోటీసులు పంపినప్పటికీ తీసుకున్న రుణాన్ని కట్టలేకపోయారు. దాంతో పొలాలు వేలం వేయనున్నట్లు అధికారులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. అప్పు తీర్చేందుకు కొంత సమయం కావాలని రైతులు వేడుకున్నా ససేమీరా అనడంతో కంటనీరు పెట్టుకున్నారు. వ్యవసాయ భూమిని బ్యాంక్ అధికారులు జప్తు చేసి వేలం వేయడం పట్ల స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నుంచి భూమి లాక్కోవడం అమానుషమని అభ్యతరం తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm