హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యలపై కర్నాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్య చేసుకునే రైతులు మానసికంగా బలహీనులని, అలాంటి ఆత్మహత్యలను ప్రభుత్వం మెడకు చుట్టడం సరికాదని అన్నారు. ఆయన మైసూరులో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బాగా కుంగిపోయిన సమయంలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. వాళ్ల తీవ్రమైన నిర్ణయాలకు ప్రభుత్వ విధానాలు కారణం కానే కాదన్నారు. కేవలం రైతులే ఆత్మహత్యలు చేసుకోవట్లేదని, పారిశ్రామికవేత్తలు, అధికారులు, ఇతరులూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారని అన్నారు. కేవలం క్షణికావేశంలోనే ప్రాణాలు తీసుకుంటున్నారన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు, విధానాలను రూపొందిస్తోందన్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) ప్రాజెక్ట్ కూడా అందులో భాగమేనని చెప్పారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ స్కీమ్ కింద వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి సానుభూతి చూపించినంత మాత్రాన సమస్యలు తీరిపోవని, ఇలాంటి పథకాలతోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm