హైదరాబాద్ : కొద్ది రోజులుగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ విషయంలో తీవ్రమైన చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాట్సాప్‌కు భారత ప్రభుత్వం గట్టి వార్నింగే ఇచ్చింది. వెంటనే కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. భారత యూజర్ల ప్రైవసీని గౌరవించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాట్సాప్ సీఈవో విల్ కాత్‌కార్ట్‌కు లేఖ రాసింది. మా కొత్త పాలసీని అంగీకరించండి లేదంటే వాట్సాప్‌ను వదులుకోండి అన్న వాట్సాప్ సందేశాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2017) కేసును ప్రస్తావించింది. ప్రైవసీ, అంగీకార సూత్రాలకు విలువ ఇవ్వాలని ఈ తీర్పు స్పష్టంగా చెప్పిందని, దానిని మీరు గమనించాలని వాట్సాప్‌కు స్పష్టం చేసింది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు ఇండియాలో చాలా మంది యూజర్లు ఉన్నారని, ఇప్పుడీ రెండింటి యూజర్ల డేటాను సేకరిస్తే అది దేశంలోని చాలా మంది పౌరుల ప్రైవసీకి భంగం కలిగించినట్లే అవుతుందని ఆ లేఖలో ఐటీ శాఖ అభిప్రాయపడింది.
Mon Jan 19, 2015 06:51 pm