అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ తీవ్ర ఇబ్బందులకు గురయిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పదో తరగతి విద్యార్థులకు నేటి నుంచి రెండు పూటలా తరగతులు జరగనున్నాయి. వీరికోసం ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 10వ తరగతి విద్యార్థులకు రోజుకు 8 పీరియడ్లు నిర్వహిస్తారు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20గంటల వరకూ తరగతులు జరుగుతాయి. జాతీయ, ఇతర పండుగలు మినహా ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహిస్తారు. ఆదివారం ఒక పూట ఒక సబ్జెక్టులో మాత్రమే తరగతులు జరుగుతాయి. అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ ప్రణాళికను అమలు చేయాలని డీఈవో సుబ్బారావు ఆదేశించారు. అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సర తరగతులు కూడా నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి క్లాసులు నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు డీఈవో సుబ్బారావు తెలిపారు. వీరికి రోజుమార్చి రోజు తరగతులు నిర్వహిస్తారన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నేడు తరగతులు ప్రారంభమవుతున్నాయి. అందుకు సంబంధించి ఇంటర్ బోర్డు సవరించిన వార్షిక క్యాలెండర్‌ను ప్రకటించింది. ఆ ప్రకారం 106 పని దినాలు ఉంటాయి. మే 31 వరకూ తరగతులు జరుగుతాయి. రెండో శనివారం కూడా కళాశాలలు నడుస్తాయి. వేసవి సెలవులను కూడా రద్దు చేశారు. 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
Mon Jan 19, 2015 06:51 pm