హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఏర్పాట్లను డీఎంఈ రమేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేపు 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, హిమోఫిలియా వ్యాధి గ్రస్తులకు వ్యాక్సిన్ ఇవ్వడం లేదని తెలిపిన ఆయన 18 ఏళ్ల లోపు వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం లేదన్నారు. కరోనా నుంచి కోలుకొని 4 వారాలు దాటిన వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చన్నారు. ఏ వ్యాక్సిన్‌లోనైనా రియాక్షన్ వచ్చే అవకాశాలుంటాయన్నారు. లక్షల్లో ఒకరికి మేజర్ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. రియాక్షన్ వచ్చిన వారికి చికిత్స కోసం 57 ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్టు డీఎంఈ రమేష్ రెడ్డి వెల్లడించారు.