హైదరాబాద్ : సుదరయ్య విజ్ఞాన కేంద్రంలోని నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ లో 'వందేళ్ళ కమ్యూనిస్టు ఉద్యమ సాహిత్య పుస్తక ప్రదర్శనను సీపీఐ(ఎం) పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేడు ప్రారంభించారు. సంపూర్ణ స్వాతంత్ర్యం పిలుపునిచ్చింది కమ్యూనిస్టు పార్టీయేనని, భారతదేశంలో కార్మిక-కర్షక రైతాంగా ఉద్యమాన్ని నిర్మించింది. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నది కమ్యూనిస్టు పార్టీయేనని తమ్మినేని అన్నారు. 1920 తాష్కెంట్ లోని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైందని, భౌతికవాద సూత్రాల పునాదిపై లెనిన్ సారధ్యంలో సోషలిస్టు రష్యా ఏర్పడటం, ప్రపంచంలో అనేక దేశాల విముక్తికి స్పూర్తిగా నిలిచిందని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొండూరి వీరయ్య సంకలనం చేసిన 'లెనిన్ యాది'లో గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. మార్కిజం - లెనినిజంగా కొనియాడే స్థితిలో లెనిన్ ప్రజా పోరాటాల నిర్వహణ ఆయన అనుభవాలు - వర్గ పోరాట దశ -దిశ తెలిపే ఈ చిన్న గ్రంథం ఎంతో విశిష్టమైనదని, ప్రచురణకర్తలైన నవతెలంగాణ బుక్ హౌస్ ను అభినందించారు. ఎస్ వికె కార్యదర్శి ఎస్. వినయ్ కుమార్ మాట్లాడుతూ వామపక్ష ఉద్యమాన్ని అర్ధం చేసుకోవడానికి ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన అనేక గ్రంథాలు ఉపయోగపడుతాయని అన్నారు. పాఠకులు ఈ ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బుక్ హౌస్ జనరల్ మేనేజర్ కోయ చంద్రమోహన్ మాట్లాడుతూ నవచేతన, మలుపు, అరుణతార, లెఫ్ట్ వర్డ్, విశాలాంధ్ర, హెచ్ బిటి తదితర వామపక్ష, అభ్యుదయ ప్రచురణ సంస్థల పుస్తకాలు ఈ ప్రదర్శనలో అందుబాటులోకి తెచ్చామని జనవరి 13న ప్రారంభమై, జనవరి 31దాకా ఈ ప్రదర్శన జరుగుతుంది. పాఠకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రారంభ సభలో జర్నలిస్ట్ రమణ, పబ్లిషింగ్ హౌస్ అసిస్టెంట్ ఎడిటర్ తంగిరాల చక్రవర్తి, కృష్ణారెడ్డి, సంగీత, ధనలక్ష్మి, సుభాషిణి, రఘు, భార్గవి, సిద్దు, అమీనా తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm