కామారెడ్డి: జిల్లాలోని భూంపల్లికి చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. భూంపల్లికి గ్రామానికి చెందిన వాగుమారి ప్రవళిక బావిలో దూకి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాగుమారి చందర్ రావుకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో ఇద్దరి పెండ్లిలు గతంలోనే చేశారు. కాగా చిన్న కూతురు ప్రవళికకి వివాహం తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన యువకునితో నిశ్చయించారు. వరకట్నంగా రూ.8లక్షలు, నాలుగు గుంటల భూమిని ఇవ్వడానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో బంధువుల సమక్షంలో ఈనెల 3న నిశ్చితార్థం జరిగింది. అప్పటికే తన ఇద్దరు అక్కలు వివాహాలు చేసి తండ్రి ఆర్థికంగా చితికిపోయి ఉండటంతో పాటు అనారోగ్యంతో బాధపడుతుండటం, తన పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకుడదని భావించిన ప్రవళిక ఆవేదనతో వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడిందని తెలిపారు. నిశ్చితార్ధం అయిన రెండో రోజే యువతి ఆత్మహత్య చేసుకోవడంతో కేవలం వరకట్నం ఒక్కటే కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.