హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ నమోదు కావడంపై విజయశాంతి ఆదేదన వ్యక్తం చేశారు. పోలింగ్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రోజుల వ్యవధిలోనే ఎన్నికలకు వెళ్లడం కూడా ఈ పరిస్తితికి ఒక కారణమనే విమర్శలు కూడా వస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంత తక్కువ ఓటింగ్ నమోదు కావడం ఆవేదన కలిగిస్తున్నప్పటికీ... ఇందులో ప్రభుత్వం, ఎన్నికల సంఘం బాధ్యత ఎక్కువనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వరుస సెలవులు ఉన్నాయని తెలిసీ, ఎక్కువ మంది నగరంలో ఉండే అవకాశం లేదని తెలిసీ... ఈ సమయంలో ఎన్నికలు వచ్చేలా షెడ్యూల్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వమే వ్యూహాత్మకంగా పోలింగ్‌ను నిర్వీర్యం చేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇది గాక, చాలా పోలింగ్ బూత్‌లలో కోవిడ్ సన్నద్ధత కనిపించలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇది కూడా ఓటర్లను భయపెట్టింది. మొత్తం మీద జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో టీఆర్ఎస్ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరించిందని అందరికీ స్పష్టమైంది అని విజయశాంతి అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm