విశాఖపట్నం : నివార్ తుపాను దూసుకొస్తోంది. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుంది. పుదుచ్చేరికి 320 కిమీ, చెన్నైకి 450 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. రేపు సాయంత్రం తమిళనాడు తీర ప్రాంతాన్ని తాకే అవకాశం ఉంది. రేపు రాత్రి కరైకల్-మహాబలిపురం మధ్య తీరం దాటనుంది. తుపాను తీరం దాటే సమయంలో ఏపీలో తీరం వెంబడే 65 నుంచి 85 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. తుపాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం దాటే సమయంలో అదే తీవ్రతతో చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నెల 26న రాయలసీమకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నివార్ తుపాన్ ప్రభావంతో చెన్నైలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎటు చూసినా కారు మబ్బులు కమ్ముకున్నాయి. పట్టపగలే చీకటైపోయింది. తమిళనాడులో ఇప్పటికే తుపాన్ ప్రభావం మొదలైంది. తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి 110 నుంచి 120 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
Mon Jan 19, 2015 06:51 pm