హైదరాబాద్ : ఏపీలో మహిళలు, పిల్లల భద్రత కోసం ఉపయోగపడే అభయం యాప్ ను సీఎం జగన్ ఈరోజు ప్రారంభించారు. ఈ యాప్ ను ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకున్న మహిళలు తమకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే యాప్ లోని పానిక్ బటన్ నొక్కితే వెంటనే పోలీసులకు సమాచారం చేరుతుందని సీఎం జగన్ వివరించారు. తొలి విడతగా 1000 ఆటోల్లో అభయం యాప్ పరికరాలను అమర్చుతున్నట్టు వెల్లడించారు. 2021 ఫిబ్రవరి నాటికి 5 వేల వాహనాలు, జూలై 1 నాటికి 50 వేల వాహనాలకు అభయం యాప్ పరికరాలు బిగిస్తారని తెలిపారు. ఇప్పటికే మహిళల రక్షణ కోసం దిశ యాప్ ఉందని, అయితే దిశ యాప్ ను పోలీసు శాఖ నిర్వహిస్తుందని, కొత్తగా తీసుకువచ్చిన అభయం యాప్ ను రవాణా శాఖ నిర్వహిస్తుందని సీఎం జగన్ వివరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన యాప్ ను ప్రారంభించి, ఆపై దానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, రవాణ శాఖ కమిషనర్ ఎంటీ కృష్ణబాబు కూడా పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm